సేద్యానికే ప్రధమ ప్రాధాన్యత

సేద్యానికే ప్రధమ ప్రాధాన్యత

 

సేద్యానికే ప్రధమ ప్రాధాన్యత

దేశ వ్యాప్తంగా దుర్భిక్ష పరిస్థితుల కారణంగా 2025 నాటికి 70 శాతం భూభాగం ఎడారి లక్షణాలు సంతరించుకునే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే హెచ్చరించిన నేపధ్యంలో ఎడారికరణ రూపేణా పెను ముప్పు ముంచుకొస్తున్న ధర్మిలా   రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్దపడింది. నీటి కరువును అధిగమించాలంటే అడుగంటిన భూగర్భ జలాలు పెంచడం తప్ప మరో మార్గం లేదు. కరువును ఎదుర్కొనేందుకు అందుబాటులో వున్న నీటి వనరులను ఉపయోగించుకునేందుకు సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రధానంగా రైతు ప్రయోజనాలు కాపాడటం కోసం నిర్దిష్ట వ్యూహాలకు పదును పెట్టి నిత్యం వ్యవసాయాభివృధ్దికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు,పొలాల్లో పంటకుంటలు,నీరు-చెట్టు కార్యక్రమంపై దృష్టిపెట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

ఏటేటా సమస్యల వలయంలో చిక్కి వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోతుండటంతో సాగుపై వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రైతుల ఆదాయాలు పెరిగితే తప్ప వారు వ్యవసాయంలో కొనసాగలేరని గుర్తించి సేద్య రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టి సమగ్ర వ్యవసాయ విధానాలను పట్టాలెక్కించింది రాష్ట్ర ప్రభుత్వం. సాగుకి నీరు ప్రధానం కాబట్టి జలసిరులని కాపాడుకోవడం ప్రగతికి ప్రధమ సోపానం అన్న స్పృహతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. వీలైనంత త్వరగా కరువు భూతాన్ని రాష్ట్రం నుండి తరిమి గొట్టాలని జిల్లాల వారీగా స్థానిక అవసరాలకు తగ్గట్టు జల సంరక్షణ వ్యూహాలు అమలు చేస్తున్నారు.

13 జిల్లాల్లో చిన్న నీటి వనరుల కింద దాదాపు 25 లక్షల ఆయకట్టు  వుంది. అందులో సగం కూడా సాగుకు నోచుకోని పరిస్థితి ఏర్పడటంతో నీరు-చెట్టు కార్యక్రమం కింద చిన్న నీటి వనరులో పూడిక తీసి వాటిలో నీటి నిలువ ద్వారా వాటి కింద వున్న ఆయకట్టుకు ఆయువు పొయ్యాలని  ప్రభుత్వం పరుగులు తీస్తుంది. వాటర్ షెడ్లు,నీటి గుంతలు,చెక్ డ్యాముల నిర్మాణం నీటి కాలువల పునరుద్దరణ,చెరువుల్లో పూడికతీత పూర్తి చేస్తే  సాగు విస్తీర్ణం పెరగనుంది. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని భూ గర్భ జలశోకం నుంచి ఉపసంహరించి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదల. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సాగు నిలదొక్కుకునేలా చేయడం కోసం సాగు నీటి రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏటా విపత్తులు రైతుల వెన్ను విరుస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నవ్యాంధ్రలో రైతుల ఆకాంక్షలకు తగ్గట్టు సాగునీటికి,ఉపాధి హామికి,పంటల ఉత్పాదకత పెంపునకు పెద్దపీట వేయడం ద్వారా వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టంగా చెప్పినట్లు అయింది. ఆ మేరకు వ్యవసాయ బడ్జెట్ లోనూ వ్యవసాయ అనుబంధ రంగాలకు మొత్తం రూ. 16,250 కోట్లు కేటాయించారు.

సాగు నీరు లేక నష్టాల సాగుతో విసుగెత్తిన రైతులు ప్రత్యామ్న్యాయాలు వెతుకుంటున్నారు. అందుకే ఏటా కమ్ముకొస్తున్న భయానక కరువును తరిమి కొట్టేందుకు చంద్రబాబునాయుడు కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో ఏటా వర్షం రూపేణా అందుబాటులోకి వచ్చే 5 వేల శత కోటి ఘనపుటడుగుల జల రాశిలో సాధ్యమైనంత వరకు భూమిలోకి ఇంకేలా చేయడం కోసం భూ గర్భ జల మట్టాలను 3 నుంచి 8 మీటర్ల మద్య వుండాలని, ఆ తరువాత 3 మీటర్లకు చేరే విధంగా చూడాలన్నది  సి‌ఎం చంద్రబాబు లక్ష్యం. అందుకే జల సంరక్షణ చర్యలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు.

 

అందుకే వర్షాలు పడని సమయంలో పంటను కాపాడేందుకు పంటకుంట పథకానికి శ్రీకారం చుట్టారు సి‌ఎం చంద్రబాబునాయుడు. పంటకుంట తవ్వేందుకు రైతులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఒక తెల్ల కాగితం మీద దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వమే ఉపాధి హామీ పథకం ద్వారా పంటకుంటలు త్రవ్వించనున్నారు. రెండున్నర ఎకరాల లోపు పొలం వున్న వారికి 5-5-2 మీటర్ల పొడవు,వెడల్పు లోతు విస్తీర్ణంతో పంటకుంటను త్రవ్వనున్నారు. రెండున్నర నుండి నాలుగున్నర ఎకరాలు వున్న పొలానికి 8-8-2 మీటర్లు విస్తీర్ణంలో పంటకుంటను త్రవ్వనున్నారు. విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో పంటకుంటకు రూ. 40 వేల నుండి రూ. లక్షా పదివేల వరకు ఖర్చు అవుతుంది. పంటకుంట పథకానికి ఎంతైనా వెనకాడేది లేదని రైతు పంటకు గ్యారంటీ ఇవ్వటమే ప్రధానమని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈ పథకాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించడమే కాకుండా జిల్లా పర్యటనలోను పంటకుంట పనులను పరిశీలిస్తున్నారు. పంట సంజీవని కింద ఈ ఏడాది 10 లక్షల సాగుకుంటలను తవ్వాలని నిర్ణయించి దీన్ని ఉపాధిహామీ పథకంతో అనుసంధానించడం మంచి పరిణామం.

ఈ ఉపాధిహామీకి బడ్జెట్లో రూ. 5,094-83 కోట్లు కేటాయించారు. దీని కింద 5 ఎకరాల్లోపు వున్న రైతులకు ఉపాధిహామీ కింద సాగుకుంటలు త్రవ్వనున్నారు. ఈ కుంటలలో  నిలువ చేసిన నీటిని రెయిన్ గన్స్ సాయంతో పంటలకు అందించాలని వర్షాభావ పరిస్థితుల్లోను పంటలను ఆదుకోవాలని ప్రభుత్వ ఆశయం. రూ. 150 కోట్లతో రైతులకు 15 వేల రెయిన్ గన్లు ఇవ్వనున్నారు. గ్రామానికి 100 పంటకుంటలు తవ్వాలని,మొత్తం 10 వేల గ్రామాలలో 10 లక్షల పంటకుంటలు తవ్వాలని సంకల్పించారు. కావున పంటను కాపాడేందుకు ప్రభుత్వం తెచ్చిన పంటకుంట పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సి వుంది. కరువు రూపేణా ప్రతి ఏటా పెనుముప్పు ముంచుకొస్తున్న దర్మిలా రైతులు తక్షణం అప్రమత్తమై ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు పంటకుంట పథకాన్ని వాడుకునేందుకు ముందుకు రావాలి. నీటికుంట పంటసంజీవనే కాదు, రైతు సంజీవని కూడా. పంటకుంటలు గాదెలన్ని నింపనున్నాయి రైతు కష్టాలు మటు మాయం కానున్నాయి. ఇంటింటికి ఇంకుడు గుంత, పొలంలో పంటకుంట రైతు ఇంట్లో సిరుల పంట.

భవిష్యత్తులో తాగు,సాగు నీటి అవసరాలు తీరాలంటే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాల్సిందే ప్రతిఒక్కరు. వర్షపు నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు నీటి నిలువ సామర్ధ్యాన్ని పెంచుకోవాలి. జలసిరులని కాపాడుకోవడమే ప్రగతికి ప్రధమ సోపానం. నేడు పొలాలకు చిన్న వనరులే పెద్ద దిక్కు. మానవాళికి ప్రాణావసరమైన నీరు ఏటేటా పాతాళానికి  దిగి పోతున్నది. జల సంరక్షణ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారితేనే పాతాళ గంగ పైకి ఉబికి వస్తుంది. మన కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యే ఇజ్రాయిల్,మెక్సికో,చైనా వంటి దేశాలు కూడా అద్భుతమైన వ్యూహాలు,శాస్త్రీయ ప్రణాళికలు,అధునాతన పద్దతులు ఉపయోగిస్తూ ఆహార భద్రత,రైతులకు ఆర్ధిక భద్రత కల్పిస్తున్నాయి. తక్కువ నీటితో సుస్థిర దిగుబడులు సాధిస్తున్నాయి. కురిసిన వర్షపు నీటి మొత్తాన్ని భూ గర్భంలోకి ఇంకేలా చేయడంలో సింగపూర్ ప్రావీణ్యం ఎవరికైనా ఆదర్శం కావాలి. సింగపూర్ ప్రతి నీటి బొట్టు నుంచి ప్రయోజనం పొందుతుంది.

అట్లాగే కొత్త రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా సేద్యానికి సాగునీరు అందించి,వ్యవసాయ ఉత్పత్తులు పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు,రైతుని ఆదుకునేందుకు కేంద్ర సహకారం అందకపోయినా  నదుల అనుసంధానాన్ని సాకారం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసి కృష్ణా డెల్టాలో ఎండిపోయే దశలో వున్న వరిపంటకు జీవం పోశారు. ఎవరేమన్నా ఈ ఏడాది కృష్ణా డెల్టా ఆయకట్టును ఆదుకున్నది పట్టిసీమే. వచ్చే ఏడాది పట్టిసీమ ఫలితం కృష్ణా డెల్టా రైతులు పూర్తిస్థాయిలో అందుకోనున్నారు. పట్టిసీమ విజయవంతం కాగానే  వెంటనే సాగునీటి ప్రయోజనం గుర్తించిన ప్రభుత్వం పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా మొన్న బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,500 కోట్లు కేటాయించింది. మొత్తం సాగునీటి రంగానికి రూ. 7,325 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. గత బడ్జెట్లోను కేటాయించిన దానికంటే మించి సాగునీటికి వ్యయం చేసిన అంశాన్ని గమనిస్తే ప్రభుత్వం సాగునీటి రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత అర్ధం చేసుకోవచ్చు. పోలవరాన్ని శీఘ్రగతిన పూర్తి చేయాలన్న తపన సి‌ఎం చంద్రబాబులో కనిపిస్తుంది. జాతీయ హోదా వున్న పోలవరం సకాలంలో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోవడంతోపాటు సర్ ఆర్ధన్ కాటన్ వలే చంద్రబాబు పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోనుంది. అట్లాగే సాగునీటి పథకాలు అన్నిటికి నిధులు పందారం చేయకుండా ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులు చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తిచేసే దిశగా కేటాయింపులు జరిపి హంద్రీ-నీవా,గాలేరు-నగరి,వంశధార,తోటపల్లి,వెలుగొండ వంటి మొత్తం ఏడు ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వం కాంట్రాక్టర్లను,అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తరచుగా ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్నారు. పోలవరాన్ని 2018 నాటికి పూర్తి చెయ్యాలని ప్రభుత్వం ధృఢ సంకల్పంతో వుంది కానీ కేంద్రం నుండి దానికి సాయం అందడమే ప్రధాన సమస్యగా మారింది.

దేశంలో ప్రకృతి మహోత్పతాల్ని ఎదుర్కొనే శాశ్వత ప్రణాళిక ఎప్పుడో రూపుదాల్చి వుండాల్సింది. జల సంరక్షణ అంశాన్ని ఏళ్ళకు ఏళ్ళు పరిపాలించిన పాలకులు పట్టించుకోకపోవడం వల్లనే వారి ఉదాసీన నిర్వాహక దుష్ఫలితాలు నేడు దేశమంతటా పస్పుటిస్తున్నాయి. జల సంరక్షణ చేపట్టి భూగర్భ జలమట్టాల పెంపునకు 15 సంవత్సరాల క్రితమే సమైక్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. నీరు-మీరు కార్యక్రమం ద్వారా చెక్ డ్యాముల నిర్మాణం,చెరువుల పూడికతీత,కాంటూరు కందకాలు,ఇంకుడు గుంతల త్రవ్వడం వంటి కార్యక్రమం చేపట్టి భూగర్భ జలాలు పెరిగేందుకు కృషి చేశారు. ఆ తరువాత 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ఇష్టానుసారం ఎగతాళి చేసి ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. అప్పటినుండి జల సంరక్షణ చేపట్టకపోవడంతో నేడు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి ప్రమాద ఘటికలు మోగించడంతో నేడు అందరూ ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని మహోధ్యమంలా చేపట్టారు. ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలమట్టాలు పెంచడం ఎంత కీలకమో ఇప్పటికైనా గుర్తించడం సంతోషకరం.   ఆనాడు చంద్రబాబునాయుడు చేపట్టి ఎగతాళికి గురైన ఇంకుడు గుంత నేడు గెలిచింది.

నేడు మళ్ళీ నీరు-చెట్టు కార్యక్రమం చేపట్టి ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళుతున్నారు ముఖ్యమంత్రి అందుకే 44 డిగ్రీల మండే ఎండని సైతం లెక్కచేయకుండా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నవ్యాంధ్రలో ప్రతి పొలానికి సాగునీరు అందించాలని ప్రతి రైతు జీవితంలో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్ష. అందుకే రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో కునారిల్లుతున్న వ్యవసాయం,రైతు శ్రేయమే ధ్యేయంగా రూ. 16,250 కోట్లతో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ పెట్టి సేద్యానికి,సాగునీటి రంగానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

నీరుకొండ ప్రసాద్

NO COMMENTS

Leave a Reply