చంద్రన్న విజయాలు
చంద్రన్న విజయాలు
నవ్యాంధ్ర ప్రదేశ్ రాబడిలో …..
రెండంకెల వృద్ధితో పరుగు పెడుతున్న రవాణాశాఖ
(డబ్బీరు రామకృష్ణ పట్నాయక్, అసోషియేట్ ఎడిటర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాసపత్రిక, హైదరాబాద్)
సమైఖ్యాంధ్ర విభజన అనంతరం అనేక ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నవ్యాంధ్ర రాష్ట్రాన్ని, దేశంలో అగ్ర రాష్ట్రాల సరసన చేర్చాలన్న సత్సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనకున్న అపారమైన పాలనానుభావంతో రాష్ట్ర ఆర్ధిక పరిపుష్టికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రభుత్వానికి సమకూరే ఆదాయాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా అతి స్వల్ప వ్యవధిలోనే రెండంకెల వృద్ధి రేటును సాధించాడానికి చంద్రబాబు నిర్విరామ శ్రమ ఫలప్రదమవుతోంది. రాబడులు తెచ్చే ప్రభుత్వ శాఖల్లో ఆదాయ మార్గాలను మరింత పెంచుకునేందుకు ముఖ్యమంత్రి అనేక సంస్కరణలను చక చకా ప్రవేశ పెడుతూ… అధికారులను సైతం ఆదాయ వనరులు పెంపొందించుకునే దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. అందుకే నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తున్నారు.
ఇలా వుంటే, రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ముఖ్యమైన కొన్ని శాఖల్లో రవాణాశాఖ కీలకమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాబడులను పెంచుకోవడంలో రెండంకెల వృద్ధి రేటును సాధించ గలిగారు. 2015 – 16 ఆర్ధిక సంవత్సరంలో అన్ని రకాల పద్దులను కలుపుకుంటే, రవాణాశాఖ మొత్తం రూ.2,128.42కోట్ల ఆదాయాన్ని ప్ర భుత్వానికి సమకూర్చింది. అంటే 20.70శాతం వృద్ధి రేటును సాధించింది. ఈ మొత్తం రాబడిలో వాహనాల జీవిత పన్ను కింద రూ.964.94కోట్లు , త్రైమాసిక పన్నుల క్రింద రూ.634.95కోట్లు, వివిధ రకాల ఫీజుల కింద రూ.195.33కోట్లు, వివిధ రకాల చట్టవిరుద్ధమైన రవాణాపై పెట్టిన కేసులవల్ల రూ.247.50కోట్లు, వినియోగ చార్జీల రూపంలో 85.70కోట్లు రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరింది. కాగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం రూ.365.05లు అధికం. 2014-15లో రూ.1763.37ల రాబడి వచ్చింది. కాగా రాష్ట్ర రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి రూ.95.58కోట్ల ఆదాయం సమకూర్చి, 926.13 శాతం వృద్ధి రేటును సాధించారు.
ఇదిలావుండగా,రాష్ట్రంలో అధిక రాబడిని సమకూర్చే తొలి ఐదు జిల్లాలలో వరుసగా కృష్ణా, విశాఖపట్నం, గుంటూరు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. వీటిలో కృష్ణా జిల్లా రూ.310.19కోట్ల ఆదాయం సమకూర్చి ప్రధమ స్థానంలో నిలిచింది. రూ.262.41కోట్ల ఆదాయాన్ని సమకూర్చిన విశాఖపట్నం జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. గుంటూరు జిల్లా నుంచి రూ.210.83కోట్ల రాబడిని సమకూర్చి తృతీయ స్థానాన్ని సాధించింది. తూర్పు గోదావరి జిల్లా రూ.203.73కోట్లు సమకూర్చి నాల్గవ స్థానాన్ని సాధించింది. చిత్తూరు జిల్లా రూ.168.17 కోట్ల ఆదాయాన్ని సమకూర్చి పంచమ స్థానాన్ని సాధించింది.
రాష్ట్రంలో 2015-16 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 13 జిల్లాలలో రవాణాశాఖ ద్వారా వివిధ రకాల వాహన పన్నులు, చార్జీలు, జరీమానాల రూపంలో గత మార్చి 31 వరకు ప్రభుత్వానికి అందిన మొత్తం ఆదాయ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
జిల్లా పేరు —- రాబడి : కొట్లలో —- వృద్ధిరేటు : శాతంలో
===========================================================
1.అనంతపురము — రూ.117.90 — 18.68
2.చిత్తూరు — రూ.168.17 — 13.51
3.కడప — రూ. 88.37 — 6.63
4.తూర్పుగోదావరి — రూ.203.73 — 10.44
5.గుంటూరు — రూ.210.83 — 20.78
6 .క్రిష్ణా — రూ.310.19 — 15.88
7.కర్నూలు — రూ.133.87 — 28.12
8.నెల్లూరు — రూ.140.38 — 10.81
9.ప్రకాశం — రూ.110.08 — 14.98
10.శ్రీకాకుళం — రూ. 74.06 — 18.62
11.విజయనగరం — రూ. 57.81 — 20.09
12.విశాఖపట్నం — రూ.262.41 — 16.45
13.పశ్చిమ గోదావరి — రూ.155.05 — 15.57
======================================================
