ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగ్రగామిగా ఏపీ

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగ్రగామిగా ఏపీ

0 1937
drinks production plant in China

విజయవాడ :  వ్యవసాయరంగంలో అగ్రస్థానంలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా అగ్రగామి కావాలనుకుంటోంది. 974 కిలోమీటర్ల తీరప్రాంతం, పోర్టులు, ఎయిర్ పోర్టులు, మెగా పారిశ్రామిక కారిడార్లు, మౌలిక వసతులు, నిరంతర విద్యుత్, పుష్కలమైన నీటి, ఖనిజ వనరులు, నైపుణ్యం కలిగిన యువత, వ్యవసాయరంగంలో అద్భుత ప్రగతి.. వెరసి.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి తిరుగులేని బలమని భావిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.

 

ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి తగిన చేయూతనిస్తే.. ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించి.. 50 వేల మందికి పైగా యువతకు ఉద్యోగావకాశాలిప్పించొచ్చని భావిస్తోంది.

పంటల ఉత్పత్తిలో తిరుగులేదు..

వ్యవసాయంలో మన రైతులు తిరుగులేని మొనగాళ్లు. ఉద్యానవన పంట ఉత్పత్తుల్లోనూ వారికి సాటి లేదు. వరి, మొక్కజొన్న, చెరకు, వేరుశెనగ వంటి వ్యవసాయోత్పత్తులే కాదు.. అరటి, మామిడి, కొబ్బరి, బొప్పాయి, జామ, నిమ్మ, జీడి, దానిమ్మ, టొమాటొ, ఉల్లి, క్యారెట్, నూనె గింజల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఉంటున్నాం మనం. కానీ పంటలు చేతికొచ్చే సరికి.. వాటికి గిట్టుబాటు ధర లభించక, నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరీజీలు లేక నానా ఇబ్బందులు పడుతోంది మన రైతాంగం. వ్యవసాయరంగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 70 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే.. ఆహార పరిశ్రమ మరో 10 లక్షల కుటుంబాలకు ఉపాధి చూపిస్తుందని అంచనా. మన రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఆహార పంటల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో దాదాపు 40 లక్షల టన్నుల ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్ చేసే అవకాశాలున్నాయని అంచనా. వీటికి తగ్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోతే.. ఈ పంట ఉత్పత్తుల్ని నేల పాల్జేయాల్సిందే.

ఈ సమస్యల పరిష్కారానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడమే సరైన మార్గంగా నిర్ణయించింది ప్రభుత్వం. ఆహార ధాన్యాలు, పాలు, పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీ, ఆక్వా ఉత్పత్తులకు మంచి ధర లభించేందుకు మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి.. వారి ఉత్పత్తులను నేరుగా ఈ ఫుడ్ పార్కులకు సరఫరా చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాకు ఒక్కో ఫుడ్ పార్క్, శీతలీకరణ గోదాముల నిర్మాణం చేపడుతోంది. ఇవి పూర్తయితే.. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి.. గిట్టుబాటు ధర సొంతం చేసుకోవచ్చు.

పెట్టుబడుల వెల్లువ

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. పెప్సి కో, క్యాడ్ బరీ, కెల్లాగ్, బ్రిటానియా, గోద్రేజ్ లాంటి బడా సంస్థలతో పాటు, చిన్నా చితకా సంస్థలు మరో డజను వరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాయి. దాదాపు 15 వేల మంది రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. ప్రభుత్వం ఇస్తున్నప్రోత్సాహం కారణంగా.. ఇప్పటికీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సై అంటున్నారు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి.. రాష్ట్రంలోని వ్యవసాయోత్పత్తులను స్థానిక అవసరాలకే కాకుండా.. విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. క్రితం ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు 26 వేల కోట్ల రూపాయలైతే.. వాటిలో మన వాటా 20 శాతానికి పైమాటే. ఈ రంగానికి మరింత ప్రోత్సాహాన్నందిస్తే.. ఎగుమతుల మొత్తం భారీగా పెరిగే అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మరో 35 సంస్థలు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఈ సంస్థలు నిర్మించే పరిశ్రమల్లో దాదాపు 10 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి.

NO COMMENTS

Leave a Reply