నీళ్లులేక పంటలు ఎండిపోవటం ఇకపై ఉండకూడదు

  0 1537

  నీళ్లులేక పంటలు ఎండిపోవటం ఇకపై ఉండకూడదు
  వర్షపాత అంతరాయాలలో పంటల్ని కాపాడటంలో మనం ఆదర్శం
  రెయిన్ గన్స్ విధానంతో మన కృషికి సర్వత్రా ప్రశంసలు
  టెలీ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
  నవ్యాంధ్ర లో నీళ్లులేక పంటలు ఎండిపోవడమనేది ఇకపై జరగకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వర్షపాత అంతరాయాలలో పంటలను కాపాడటం(డ్రైస్పెల్ మిటిగేషన్)పై గురువారం అనంతపురం నుంచి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితిని ఆరురోజుల్లో అదుపులోకి తెచ్చామని, సకాలంలో రక్షక తడులిచ్చి పంటలు కాపాడినట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో మరో రెండు, మూడు తడులివ్వాలని అధికారులను ఆదేశించారు.
  రెయిన్ గన్స్ టెక్నాలజీ ద్వారా నూతన శకం
  రెయిన్ గన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో నూతన శకం ప్రారంభించామని, పంటకుంటలు, ట్యాంకర్లు, ఆయిల్ ఇంజిన్లు, రెయిన్ గన్స్ ద్వారా రక్షక తడులు ఇచ్చి పంటలు కాపాడటం దేశంలోనే సరికొత్త చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పంటలు కాపాడటంలో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయడం శుభ పరిణామమని తెలిపారు. సరైన అంచనాలు, చక్కని అవగాహనతో ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్నారు. వర్షపాత అంతరాయాలలో పంటలను కాపాడే విధానాన్ని దేశ, విదేశాలకు ఆదర్శమన్నారు.

  కరవును తరిమికొట్టడంలో మన రాష్ట్రం ఒక రోల్ మోడల్
  కరవును తరిమికొట్టడంలో ఈ విధానం ఒక ‘రోల్ మోడల్ ’ అని చెప్పారు. వర్షాభావంలోనూ పంట కాపాడుకునే ధీమా రైతులకు వచ్చిందని, ధైర్యంకలిగిందని, ఇందుకోసం నిర్విరామంగా పనిచేసిన అధికారులకు, సిబ్బందికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రెయిన్ గన్లతో వర్షాభావాన్ని, కరవును ఎదుర్కొన్న తీరు అద్భుతమన్న ప్రశంసలు వస్తున్నాయని, పర్యటనల్లో తాను ఎక్కడికెళ్లినా రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నానని, తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు.
  ఎండిపోతున్న పంటలను కాపాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారని, మీడియా కూడా ఆశ్చర్యపోయిందని సీఎం తెలిపారు. ప్రతిపక్షాల వాళ్లు కూడా ఇకపై నోరు తెరవలేరంటూ, వర్షాభావాన్ని సమర్ధంగా ఎదుర్కొన్నందుకు మీడియా తనకు ధన్యవాదాలు చెప్పడం గొప్ప విషయమని చంద్రబాబు తెలిపారు.

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

  వర్షపాత అంతరాయాలలో పంటలను కాపాడటం (డ్రైస్పెల్ మిటిగేషన్) తొలిదశ ఆపరేషన్ పూర్తిచేసినట్లు రేపటికల్లా కర్నూలులో ప్రకటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాయలసీమ నాలుగు జిల్లాలను ఒకదాని తర్వాత మరొకటి ‘స్ట్రెస్ ఫ్రీ’ గా ప్రకటిస్తామన్నారు. డ్రైస్పెల్ మిటిగేషన్, స్ట్రెస్ మేనేజిమెంట్ లో అన్నీశాఖలూ ఒక టీముగా పనిచేసి, అద్భుత ఫలితాలు సాధించారంటూ, ఈ కృషిలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ ‘టీం స్పిరిట్’ ను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఉత్పాదన పడిపోకుండా ఈవిధంగా రక్షక తడులిచ్చి పంటలు కాపాడటం అపూర్వమని, ఇతర దేశాలకు కూడా ఇదొక నమూనా అని సీఎం చెప్పారు.

  NO COMMENTS

  Leave a Reply