ముఖ్యమంత్రికి అంతర్జాతీయ అవార్డు
- ‘యుఎస్ఐబీసీ ట్రాన్స్ఫోర్మెటివ్ ఛీఫ్ మినిస్టర్’ చంద్రబాబు
- కాలిఫోర్నియాలో మే8న ప్రదానం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. యు.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యు.ఎస్.ఐ.బి.సి) ఆయనకు ‘ట్రాన్స్ఫోర్మెటివ్ ఛీఫ్ మినిస్టర్’ పురస్కారాన్ని ప్రకటించింది. మే 8 తేదీన కాలిఫోర్నియాలో జరగనున్న రెండో వార్షిక పశ్చిమ తీర సదస్సు (సెకండ్ యాన్యువల్ వెస్ట్ కోస్ట్ సమ్మిట్)లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకరణ తర్వాత కీలకోపన్యాసం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ జాన్ ఛాంబర్స్ ఆహ్వానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆహ్వానం అందింది.
కాలిఫోర్నియాలోని మెన్లోపార్క్ (Menlo Park) లో భారీస్థాయిలో ఏర్పాటయ్యే ఈ సదస్సుకు అమెరికాలోని ఆర్ధిక సేవలు, శుద్ధ ఇంధనం, ఆరోగ్య పరిరక్షణ, మౌలిక సదుపాయాలు, ఉత్పాదక పరిశ్రమలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. అమెరికా మాజీమంత్రి డా. కండోలిజా రైస్, ఫిన్టెక్, ఐఓటీ పారిశ్రామికాధిపతులు, అమెరికాలో భారత్ రాయబారి నవతేజ్ సర్న తదితరులు పాల్గొంటారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కార్యదర్శి అరుణా సుందరరాజన్కు ఇదే సదస్సులో ‘ట్రాన్స్ఫార్మేటివ్ లీడర్షిప్’ అవార్డు ప్రదానం చేస్తారు.
రెండో వార్షిక పశ్చిమ తీర సదస్సు సందర్భంగా ప్రతిష్ఠాత్మక కంపెనీలు సిస్కో, గూగుల్, ఫేస్బుక్, లింకిడ్ ఇన్, ఎడోబ్, ఇన్టెల్, ఎయిర్ బి.ఎన్.బిలతో వ్యాపార, వాణిజ్య అవకాశాలపై యు.ఎస్.ఐ.బి.సి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయనుంది. ఆయా కంపెనీల కార్యాలయాలు సందర్శించే వీలు కల్పిస్తారు. మే 8వ తేదీన మధ్యాహ్నం వరకు సదస్సు కొనసాగుతుంది. ఆతర్వాత తర్వాత రెండు రోజుల పాటు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఉంటాయి.