సముద్ర వాణిజ్యానికి నార్వే సహకారం

సముద్ర వాణిజ్యానికి నార్వే సహకారం

0 2976

 

అమరావతి :  స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డ్ తరహాలో స్థానిక పాలనలో సాధికారతను పెంచే వినూత్న ఆలోచనలు తమనెంతో ఆకర్షించాయని నార్వే రాయబారి నీల్స్ రాగ్నర్ (Nils Ragnar) చెప్పారు. శుక్రవారం సాయంత్రం శాసనసభ వాయిదా అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన నార్వే రాయబారి ఏపీలో కల సానుకూలాంశాల గురించి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డ్ అమలుతీరును తెలుసుకున్న నార్వే రాయబారి ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల వారు సుస్థిర, సమ్మిళిత అభివృద్దిని సాధించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహద పడుతుందన్నారు.
సముద్రం, సముద్ర గర్భానికి సంబంధించిన విజ్ఞానంలో నార్వే బలీయంగా ఉందని, చమురు, సహజ వాయువుల వెలికితీతలో తమ దేశం బలమైన శక్తిగా ఉందని నార్వే రాయబారి తెలిపారు. సముద్ర గర్బ కార్యకలాపాలకు సంబందించిన సాంకేతికతలో నార్వే ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని ముఖ్యమంత్రికి చెప్పారు. నౌకా నిర్మాణ కార్యకలాపాల్లో, సముద్ర ఆధారిత వ్యవహారాల్లో, ఓడ రేవుల నిర్వహణకు సంబంధించిన అత్యున్నత సాంకేతిక పరిష్కారాలలో నార్వే పేరెన్నిక గన్న దేశమని చెప్పారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో తమ దేశం ప్రపంచంలోనే ద్వితీయ స్థానంలో ఉందన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి నార్వేతో ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో సారూప్యతలు ఉన్నాయని అన్నారు. 15 శాతం వృద్ది రేటుతో ఈ ఆర్ధిక సంవత్సరలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. సముద్ర ఆధారిత కార్యకలాపాల్లో నార్వే సహకారం తీసుకుంటామని చెప్పారు.
అత్యదిక ఆదాయ సముపార్జనకు అవకాశం ఉన్న సముద్ర ఆధారిత వాణిజ్య కార్యకలాపాలపై ఇప్పుడు అత్యదిక శ్రద్ధ పెడుతున్నామని, నార్వే సహకారంతో ఈ రంగంలో సత్వర వృద్ది సాధించగలమన్న నమ్మకం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త రాష్ట్ర అభివృద్దిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దార్శనికతను ప్రత్యక్షంగా చూస్తున్నామని నార్వే రాయబారి ఈ సందర్భంగా ప్రశంశించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవి రాజమౌళి పాల్గొన్నారు.

NO COMMENTS

Leave a Reply